క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ – Ksheerabdi Dwadasi Katha
Ksheerabdi Dwadasi is an auspicious day in the month of Karthika, also called as Chiluka Dwadasi, Yogeeswara Dwadasi, HariBodhini Dwadasi. It falls on the 12th day of Karthika month. It is an auspicious day for the Hindus, particularly the married women. On Ksheerabdi Dwadasi day, married women, mostly in the Southern states perform Tulasi Pooja in the evening. Holy Basil plant is worshiped by the married women on this auspicious day for a happy and blissful married life.
During Ksheera Sagara Mathanammany things have come, finally came out the nectar of immortality – Amrut. Holding the pitcher of amrut, Lord Vishnu shed tears of joy, from which was born Tulasi. Lord Vhsnu accepted her as his consort. He made her sit in his lap and told her that she has the capability to purify the world. Tulasi is the favorite of the Lord Vishnuit is believed that the Tulasi plant has emerged on this day.
క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ – Ksheerabdi Dwadasi Katha in Telugu
పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి యనుజ్ఞ బొంది కూరుచుడి కొంతతడువు మాటలాడి యాయనతో ‘స్వామీ! మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు దెలియని దర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్దించునో సెలవిండు, అని యడుగగా వ్యాసుడు ‘నాయనా! మంచి ప్రశ్న చేసినావు.
ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పినాడు.క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము, క్షీరాబ్ధి శయన వ్రతము అను నా రెండు వ్రతములలో క్షీరాబ్ధి ద్వాదశీవ్రతమును నీకు జెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూఁకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి, యొక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా – ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసిపూజచేసి తులసికథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును బొందును.
అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము, అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధాన మెట్టిదో నాకు జెప్పమని యడుగగా వ్యాసిడిట్లు చెప్పదొండగెను. ‘ దర్మరాజా! ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసికొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల మ్రుగ్గుల పెట్టి పలువిధముల నలంకరించి తులసీ మాలమందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోను బూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెఱుకుముక్కలు సమర్పించి తాంబూలనీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును విని యనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తిచేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముంగాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను జెప్పుమని యడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. ‘యుధిష్టిరా! దీపదానమహిమనెవడు చెప్పగల్గును ? కార్తిక శుద్ద ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను.
ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును. నూఱు చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగాఁ జేసిన నా ఫలములు నేను జెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్దిశాలి యగును. నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును. పదివేసిన విష్ణుసాయుజ్యము నొందును. వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన యెడల కురుక్షేత్రమందు జేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది. నూవులనూనె మధ్యమము. తేనె యదమము. ఇతరములైన అడవినూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవినూనె కామ్యార్థప్రదము, అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానములవలననే యింద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి యున్న నెవడు చూచి యానందపడునో వాని పాపములన్నియు నశించును.
ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు.’ అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును జెంది తులసీ మహత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తికమాసమందు తులసిపూజ చేయువారుత్తమలోకమును బొందుదురు. తుదకు ఉత్థానద్వాదశినాడైనను తులసిపూజ చేయనివారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు. తులసిమొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము బొందుదురు. తులసి యున్న ఇంటిలో గాపురము చేయుట, తులసితోట వేసి పెంచుట, తులసిపేరులు దాల్చుట, తులసిదళము భక్షించుట, పాపహరములు.
తులసి యున్న చోటునకు యమకింకరులు రారు. ‘యాన్ములే….’ అను మంత్రమును బఠించు వారికి నే బాధయు నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము. కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేదులను నిద్దఱు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక స్థలములో నొక తులసితోటను జూచిరి. చూచినతోడనే వారిలో సుమేధుడు భక్తితో బ్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక మఱ్ఱిచెట్టునండకుజేరి తులసికథ నిట్లు చెప్ప దొడఁగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో యుత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృతకలశము పుట్టెను. ఆ యమృతకలశమును జేత బూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై నానందబాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలదానవగు మని ప్రేమ మీఱ బలికెను. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను. అని యా బ్రాహ్మణుండు పలుకుచుండగానే యామఱ్ఱి ఫెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొఱ్ఱలోనుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీ రెవరిని యడిగిరి.
ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియెను. ‘ నేను దేవలోకవాసిని, నాపేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున గామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడివలన సమాధి చలించి యచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై యిట్లు నాకలజడి కలిగించితివి గావున బ్రహ్మ రాక్షసుడవగు మని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు గనుక వారివలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు వెఱచి యా మునిని వేడి ప్రసన్నునిజేయగా నాయన యనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసిమహిమను, విష్ణుప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అనిగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై యీ చెట్టు తొఱ్ఱలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని’ అని జెప్పి , రెండవవాని వృత్తాంతము చెప్పసాగెను.
‘ ఈయన పూర్వమొక మునికుమారుడిగానుండి గురుsకులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షస్సువగు మని గురువు వలన శాపము బొంది యిట్లు నాతో గలసియుండెను. మేమిద్దఱమును మీదయ వలన బవిత్రులమైతిమి. ఇట్లు మమ్మనుగ్రహించినారు గాన మీతీర్థయాత్రాఫలము సిద్దించినది.’ అని చెప్పి వారిరువురు వారిత్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దఱు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్రముగించుకొని యిండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి యుత్తమగతిని జెందుదురని బ్రహ్మ నారదునకు జెప్పెను.’ అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ! ఇట్లు క్షీరాబ్ధివ్రతము జేసి తులసికథ విన్నవారుత్తములగుదురు.